Rain in Suryapet | ఉమ్మడి నల్లగొండ జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు నల్లగొండ జిల్లా కట్టంగూర్, నకిరేకల్ మండలాల్లో దాదాపు ఆరు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. సూర్యాపేటలో 14.5 సెంటీమీటర్లు, నకిరేకల్, కట్టంగూరు మండలాల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రారంభమైన భారీ వర్షం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు కొనసాగింది. అనంతరం తొమ్మిదింటి వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం నీటితో పలు చోట్ల పంట పొలాలు చెరువులను తలపించాయి. పట్టణాలు, పల్లెల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.