న్యూఢిల్లీ, జూలై 3: జైడూస్ లైఫ్ సైన్సెస్, అపోలో హాస్పిటల్స్ సంయుక్తంగా 45 ఏండ్లు దాటిన వయోజనులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నాయి. దేశంలో మొదటిసారిగా చేపట్టనున్న ఈ ప్రయోగంలో ఒక రక్త పరీక్షతో పది రకాల క్యాన్సర్లను నిర్ధారించనున్నారు. అమెరికాకు చెందిన గ్వార్డెంట్ హెల్త్ సంస్థ ఈ ‘షీల్డ్ మల్టీ-క్యాన్సర్ డిటెక్షన్’ (ఎంసీడీ) పరీక్షను అభివృద్ధి చేసింది. కాగా, జైడూస్తో చేసుకున్న ప్రత్యేక ఒప్పందం ప్రకారం ఈ పరీక్షను భారత్‌లో కూడా నిర్వహించనున్నారు. అపోలో హాస్పిటల్స్‌తో చేసుకున్న ప్రత్యేక అవగాహన ఒప్పందం మేరకు దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఈ పరీక్షను అందుబాటులోకి తేనున్నారు.
ఢిల్లీకి చెందిన డాక్టర్ డాంగ్స్ ల్యాబ్ దేశవ్యాప్తంగా రక్త పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ రక్త పరీక్షకయ్యే ఖరీదును ఇంకా నిర్ధారించలేదు. షీల్డ్ ఎంసీడీ పరీక్షను 45 ఏండ్లు దాటిన, క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశమున్న వారి కోసం రూపొందించారు. రక్త ప్రవాహంలో ఉండే డీఎన్ఏలో క్యాన్సర్ ఉనికిని సూచించే మిథైలేషన్ నమూనాలలో మార్పులను ఈ పరీక్ష ద్వారా కనుగొంటారు.
ఈ పరీక్ష ద్వారా మూత్రాశయ, రొమ్ము, పెద్ద పేగు, కాలేయం, ఊపిరితిత్తులు, అన్నవాహిక, జీర్ణాశయ, అండాశయ, క్లోమ, ప్రొస్టేట్ క్యాన్సర్లను నిర్ధారించవచ్చు. భారత్‌లో ప్రాణాంతకంగా మారిన ఈ క్యాన్సర్ వ్యాధులు చాలా ఆలస్యంగా బయటపడుతున్నాయి.