న్యూఢిల్లీ : కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొందుకునే ఏకైక ఆయుధం టీకా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతున్నది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు టీకాల పంపిణీ మొదలు కాలేదు. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా 12 సంవత్సరాలు పైబడిన వారందరి కోసం జైకోవ్-డీ పేరిట టీకాను తయారు చేసింది. భారత్‌లో 12-18 సంవత్సరాల పిల్లలకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌గా నిలిచింది.
జైకోవ్-డీ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సైతం ఆగస్ట్‌లో ఆమోదం తెలిపింది. అయితే, ఈ వ్యాక్సిన్‌ను జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమంలోకి తీసుకువచ్చి.. కేవలం పెద్దవారికి మాత్రమే వేయనున్నట్లు సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జైడస్ క్యాడిలాకు కోటి డోసులు ఆర్డర్ సైతం ఇచ్చింది. మరో వైపు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లో జైకోవ్-డీని చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్నది.
త్వరలోనే జైడస్ టీకాను జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమంలో చేర్చనున్నారు. అయితే, పిల్లలకు టీకా వేసే విషయంలో తొందరపడొద్దని కేంద్రం భావిస్తున్నది. నిపుణుల అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా పిల్లలకు టీకాలు వేయడం లేదని, కొన్ని దేశాల్లో పరిమిత స్థాయిలోనే జరుగుతుందని తెలిపారు.