సింగపూర్: భారతీయ గాయకుడు, పాటల రచయిత జుబీన్ గార్గ్ నిరుడు సెప్టెంబర్లో లాజరస్ దీవిలో మునిగిపోయిన సమయంలో అతిగా మద్యం సేవించారని కరోనెర్స్ కోర్టుకు సింగపూర్ పోలీసులు బుధవారం తెలిపారు. ఆయన లైఫ్ జాకెట్ ధరించకుండా సముద్రంలోకి వెళ్లారని పేర్కొన్నారు. ఈత కొట్టేటపుడు ఆయన మొదట లైఫ్ జాకెట్ను ధరించారని, కొంత సేపటి తర్వాత దానిని తొలగించారని తెలిపారు. చిన్న లైఫ్ జాకెట్ను ఆయనకు ఇచ్చేందుకు అక్కడ ఉన్నవారు ప్రయత్నించినప్పటికీ, ఆయన దానిని తిరస్కరించారని తెలిపారు. లైఫ్ జాకెట్ లేకుండా నీటిలోకి వెళ్లి, లాజరస్ దీవివైపు ఈతకొట్టడం ప్రారంభించారన్నారు. ఆయన తిరిగి యాట్ వైపు రావడం కోసం ఈదుతున్నట్లు చాలా మంది చూశారని చెప్పారు. ఆ తర్వాత నీటిలో ముఖం కిందకు పెట్టుకుని తేలియాడుతూ కనిపించారని తెలిపారు. వెంటనే ఆయనను యాట్లోకి చేర్చి, సీపీఆర్ చేశారన్నారు. కానీ అదే రోజు ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు.