న్యూఢిల్లీ, డిసెంబర్ 31: మెరుగైన వేతనాలు, పని పరిస్థితులను డిమాండు చేస్తూ దేశవ్యాప్తంగా బుధవారం గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టారు. దీంతో నూతన సంవత్సర వేడుకల వేళ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర సేవలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. గిగ్ వర్కర్స్ సమ్మె పిలుపు నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారాలైన జొమాటో, స్విగ్గీ తమ డెలివరీ పార్ట్నర్స్కి ఇన్సెంటివ్‌లు పెంచాయి. పండుగల సీజన్లో ఈ రకంగా ఇన్సెంటివ్‌లు పెంచడం సర్వసాధారణంగా జరిగేదేనని తెలుస్తోంది.
దేశవ్యాప్త సమ్మెలో లక్షలాది మంది వర్కర్స్ చేరుతున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ బుధవారం వెల్లడించాయి. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా సమ్మె ప్రభావం వల్ల జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారాల సేవలకు అంతరాయం ఏర్పడింది. పీక్ అవర్స్‌లో ప్రతి ఆర్డర్‌కు రూ. 120 నుంచి రూ. 150 వరకు ఇన్సెంటివ్‌లు చెల్లించేందుకు జొమాటో తన డెలివరీ పార్ట్నర్స్కు సంసిద్ధత తెలిపింది.