(జోజిలా నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి) జూన్ 9 : హిమాలయాల దిగువన చారిత్రక ఘట్టం ఆవిష్కతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, ఆసియాలోనే అత్యంత పొడవైన రోడ్ టన్నెల్ జోజిలా బ్రేక్ త్రూ విజయవంతంగా పూర్తయ్యింది. కేంద్రమంత్రి గడ్కరీ, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎల్జీ మనోజ్ సిన్హా, మేఘా ఇంజినీరింగ్ అధినేత కృష్ణారెడ్డి తదితరులు సొరంగ చేదానికి సంబంధించిన తుది పనులను మంగళవారం ప్రారంభించారు. బ్రేక్ త్రూ (సొరంగచేధం) తుదిఘట్టం తర్వాత బాల్తాల్- సోనామార్గ్ మధ్య 13.153 కిలోమీటర్ల పొడవైన సింగిల్ ట్యూబ్ టన్నెల్ తవ్వకం పూర్తయ్యింది. భారత మౌలిక వసతుల రంగంలో ఇదో మైలురాయి. 2020 అక్టోబర్‌లో రూ.12 వేల కోట్ల అంచనాతో పనులు ప్రారంభం కాగా.. కేవలం రూ.7 వేల కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి కాబోతున్నది.
సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో ఈ సొరంగ మార్గాన్ని జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివద్ధి సంస్థ (ఎన్హెచ్ఐడీసీఎల్) పర్యవేక్షణలో.. హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ సంస్థ మేఘా నిర్మిస్తున్నది. శ్రీనగర్- కార్గిల్-లేహ్ మార్గంలో ప్రస్తుతం 6 నెలలు మాత్రమే సాధారణ రోడ్డు రవాణాకు అవకాశముండగా.. మిగిలిన 6 నెలలు హిమపాతం ఆటంకంగా మారుతున్నది. 2028 ఫిబ్రవరిలో ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్న ఈ టన్నెల్‌తో ఏడాది పొడవునా రవాణా సాధ్యమవనున్నది. సోనామార్గ్- మీనామార్గ్ మధ్య ప్రయాణ సమయం 3.5 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గనున్నది. ఇక భారత రక్షణ దళాలు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా నేరుగా, వేగంగా సరిహద్దులకు చేరుకోవచ్చు.
అనూహ్యమైన భౌగోళిక పరిస్థితులు, సున్నితమైన రక్షణ ప్రాంతం, ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణం, ఎముకలు కొరికే చలి, విరిగిపడే కొండ చరియలు.. జోజిలా టన్నెల్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకులుగా నిలిచాయి. 13.153 కిలోమీటర్ల టన్నెల్ మార్గంలో రాతి స్వభావం 67 సార్లు మారడం ఇంజినీరింగ్ పరంగా క్లిష్టమైన సవాలుగా నిలిచింది. న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతి (ఎన్ఏటీఎం)లో ఈ టన్నెల్‌ను మేఘా నిర్మిస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో కోటి సురక్షిత మ్యాన్ అవర్స్‌ను సంస్థ ఇప్పటికే అధిగమించింది.
దేశ మౌలిక వసతుల చర్రితలో జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ ఓ సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని కేంద్రమంత్రి గడ్కరీ అన్నారు. ఇది కేవలం రహదారి మాత్రమే కాదని లద్దాఖ్-జమ్ముకశ్మీర్ ప్రాంతాలకు జీవనరేఖ లాంటిదని అన్నారు. 2014లో ప్రాజెక్టును చేపట్టాలని అనుకున్నప్పటికీ అనేక పర్యాయాలు టెండర్ల దశలోనే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని, చివరికి మేఘా సంస్థ చొరవ, కార్మికుల కృషితో అంచనా వ్యయం కన్నా తక్కువకే ప్రాజెక్టు పూర్తవ్వడం ఆనందంగా ఉందన్నారు.