Zika Virus | దేశంలో జికా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తున్నది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికి జికా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముంబయి చెంబూర్ సమీపంలోని ఎం-వెస్ట్ వార్డులో నివాసం ఉంటున్న 79 సంవత్సరాల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తి జులై 19 నుంచి జ్వరం, ముక్కు మూసుకుపోవడం, దగ్గుతో సహా పలు లక్షణాలు కనిపించాయి. మొదట ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నాడు.
ప్రస్తుతం జికా వైరస్‌కు నిర్ధిష్టంగా ఏ చికిత్స లేదు. నొప్పి నుంచి ఉపశమనం కోసం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. జికా వైరస్‌ను తొలిసారిగా 1947లో ఉగాండాలోని జికా ఫారెస్ట్‌లో తొలిసారిగా గుర్తించారు. 2015లో అమెరికాలో, బ్రెజిల్‌తో పాటు పలు దేశాలకు సైతం వైరస్ సోకింది. ఆఫ్రికా, నైరుతి ఆసియా, పెసిఫిక్ ద్వీపాల్లో జికా వైరస్ కలకలం సృష్టించింది. 2016లో బ్రెజిల్లో ఈ వైరస్ కారణంగా సంక్షోభం ఏర్పడగా.. ఆ దేశాన్ని సంక్షోభాన్ని కుదిపేసింది. భారత్‌లో కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. జికా వైరస్ సాధారణంగా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏడిస్ దోమల కారణంగా సోకుతుంది. మనిషిని కుడితే.. జికా సోకే ప్రమాదం ఉంటుంది.