న్యూఢిల్లీ, మే 12: దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ ఆ ఊసే మరచారు. దీంతో దేశంలో యువతలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరుకుంది. గత నాలుగు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ(ఎంఓఎస్పీఐ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది.
15-29 వయసు గల మహిళల్లో నిరుద్యోగిత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 16.6 శాతం నుంచి జనవరి-మార్చి త్రైమాసికంలో 17.7 శాతానికి పెరిగింది. 15 ఏండ్లు, అంతకంటే తక్కు వ వయసు వారిలో నిరుద్యోగిత రేటు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 4.8 శాతం నుంచి జనవరి-మార్చిలో 5 శాతానికి పెరిగినట్లు కరెంట్ వీక్లీ స్టేటస్ తెలిపింది. యువ పురుషులలో నిరుద్యోగిత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 13.5 శాతం నుంచి 14 శాతానికి పెరిగింది.
పీఎల్ఎఫ్ఎస్ నివేదిక ప్రకారం మొత్తం పట్టణ నిరుద్యోగితలో స్వల్ప తగ్గుదల, గ్రామీణ నిరుద్యోగితలో కొద్దిగా పెరుగుదల కనిపించింది. ఈ నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 6.7 శాతం ఉండగా మార్చి త్రైమాసికంలో అది 6.6 శాతానికి తగ్గింది.గ్రామీణ నిరుద్యోగిత గత త్రైమాసికంలోని 4.0 శాతం నుంచి 4.3 శాతానికి స్వల్పంగా పెరిగింది.