న్యూఢిల్లీ : సాయుధ దళాల్లో యువతను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకోవడానికి అగ్నిపథ్ పేరిట కొత్త విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనను దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువత ఆందోళన బాట పట్టింది. మా ఆశలను చంపేస్తున్నారని కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్, బక్సర్‌లో ఇవాళ యువత భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. కేంద్రం చెప్పినట్టు నాలుగేండ్ల కాంట్రాక్ట్ అయిపోయాక ఏం చేయాలని ఓ యువకుడు ప్రశ్నించాడు. నాలుగేండ్ల తర్వాత మరో ఉద్యోగం కోసం మళ్లీ చదవాలా? అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
మరో యువకుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఆర్మీ ఉద్యోగం సాధించేందుకు కఠోర శ్రమ చేస్తున్నాను. గత రెండేండ్ల నుంచి శారీరకంగా ఫిట్ సాధించాను. నాలుగేండ్ల ఉద్యోగం కోసం ఇంతలా కష్టపడాలా? కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అతను చెప్పుకొచ్చాడు.
త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్రంలోని మోదీ సర్కారు కొత్త స్కీం తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సాయుధ దళాల్లో యువతను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకోవడానికి ‘అగ్నిపథ్’ పేరిట కొత్త విధానాన్ని ప్రకటించింది. నాలుగేండ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం వెల్లడించారు. కేంద్ర క్యాబినెట్ అంతకుముందు ఈ స్కీమ్‌కు ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది తొలి బ్యాచ్ కింద 46 వేల మంది యువతను నియమించుకోనున్నట్టు రాజ్‌నాథ్ తెలిపారు. నాలుగేండ్ల సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన అగ్నివీరుల్ని (బ్యాచ్‌కు 25% మంది చొప్పున) శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. శాశ్వత కమిషన్‌లో ఎంపిక కాని వారికి ఈ స్కీమ్ కింద ఎలాంటి పింఛను ఉండదు.