అహ్మదాబాద్: ఢిల్లీలో ఇటీవల ఓ యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనను మరువకముందే గుజరాత్లో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. సూరత్‌లో ఓ యువకుడిని ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన తాజాగా బయటకు వచ్చింది. తన భార్యతో కలిసి ఆ యువకుడు బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. అయితే అతడి తల కారు కింది భాగంలో చిక్కుకుపోయింది. అయినా కారు డ్రైవర్ అలాగే పోనిచ్చాడు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫోన్లో రికార్డు చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న కారును గుర్తించామని, నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.