Instagram : ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియా అకౌంట్లు వాడే వారికి ఇది ఒక రకంగా గుడ్ న్యూసే. ఇకపై అన్ని సోషల్ మీడియా అకౌంట్లకు కేవైసీ తప్పనిసరి చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదే జరిగితే, ఫేక్ అకౌంట్లు అన్నీ తొలగిపోతాయి. దీంతో ఆన్లైన్లో మోసాలకు తక్కువ అవకాశం ఉంటుంది. ఈ మేరకు కేంద్రం త్వరలో దీనిపై ఆదేశాలు జారీ చేయనుంది. ఆన్లైన్, సోషల్ మీడియా మోసాలు అరికట్టేందుకు, సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర హోం వ్యవహారాలు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది.
దీనిపై అధ్యయనం చేసిన కమిటీ తాజాగా కేంద్రానికి కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం ఇకపై ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ కేవైసీ చేయించాలి. పార్లమెంటరీ కమిటీ చేసిన కీలక ప్రతిపాదనలివి. సోషల్ మీడియా యాప్స్, గేమింగ్ యాప్స్, డేటింగ్ యాప్స్‌లో ఇకపై కేవైసీ తప్పనిసరి. బ్యాంకులు, ఇతర ఫైనాన్సియల్ సంస్థలు అనుసరించే కేవైసీ విధానాన్నే ఈ యాప్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. అలాగని, ఏదో ఒకసారి చెక్ చేసి వదిలేయకుండా, తరచూ వెరిఫికేషన్ చేస్తుండాలి. ఇకపై సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసేవాళ్లపై కూడా కఠిన చర్యలుంటాయి. వీరిని హై రిస్క్ కేటగిరిలో పెడతారు. అలాగే గేమింగ్, డేటింగ్ యాప్స్ లైసెన్సింగ్ విషయంలో కూడా కేంద్రం కఠిన నిబంధనలు రూపొందించనుంది. ఇకపై వీటిలో గైడ్‌లైన్స్ కఠినంగా ఉంటాయి. అలాగే ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి. అలాగే అనుచిత, అభ్యంతరకర కంటెంట్‌పై యూజర్లకు లిమిట్ యాక్సెస్ ఉంటాయి.
ఇటీవలి కాలంలో ఆన్లైన్లో, సోషల్ మీడియా యాప్స్‌లో వేధింపులు, సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. ఫేక్ అకౌంట్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. అందులోనూ ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియోలు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు, నిందితుల్ని సులభంగా గుర్తించేందుకు వీలుగా పార్లమెంటరీ కమిటీ తాజా ప్రతిపాదనలు చేసింది. ఆన్లైన్లో వచ్చే ఫిర్యాదుల్ని త్వరగా పరిష్కరించేందుకు తగిన వ్యవస్థను రూపొందించాలని కూడా కమిటీ సూచించింది.