హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఏదైనా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మార్గం వెతుకుతావు.. లేదంటే సాకులు వెతుకుతావు.. అయితే ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి మాత్రం మార్గం వెతుకుతున్నాడు. పేదరికం.. కుటుంబ పరిస్థితులు.. సమయాభావం.. తల్లి అనారోగ్యం.. ఇలా ఏవీ తనకు సాకులు కాలేదు. ఆర్మీలో చేరాలన్నది లక్ష్యం మాత్రమే తన కళ్ల ముందు కనిపిస్తున్నది. దాన్ని నెరవేర్చుకునేందుకు రోజూ 10 కిలోమీటర్లు పరిగడుతున్నాడు. అందరు అభ్యర్థులూ ఇలాగే పరిగెడుతారు కదా.. ఇందులో కొత్తేముందని అనుకోకండి. ఎందుకంటే మనోడు పరిగెత్తేది ఉదయం పూట కాదు.. అర్ధరాత్రి. అదికూడా ఓచోట పొద్దంతా పని చేసి ఇంటికి వెళ్లే సమయాన్ని ఇలా ప్రాక్టీస్ కోసం వాడుకుంటున్నాడు. ఉదయం లేచి ఇంటి పని చేసుకుని 8 గంటలకల్లా పనికి వెళ్లడం.. రాత్రి 12 గంటల వరకు పనిచేసి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లడం.. ఆ తర్వాత వండుకుని తినడం.. ఇదీ ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏండ్ల కుర్రాడు ప్రదీప్ మెహ్రా దినచర్య. జాతీయ అవార్డు విన్నింగ్ ఫిల్మ్‌మేకర్ వినోద్ కపూర్ అర్ధరాత్రి పరిగెడుతున్న ప్రదీప్‌ను గమనించి తన కారులో దింపుతానన్నా కూడా వద్దని, అలా వెళ్తే తన ప్రాక్టీస్ దెబ్బ తింటుందని చెప్పిన ప్రదీప్ మాటలకు నెటిజనం ఫిదా అవుతున్నారు.
పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన వీడియో..
ఈ వీడియోపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పక చూపించాల్సిన వీడియో.. అమేజింగ్ యంగ్ మ్యాన్ దిస్’అని ట్వీట్ చేశారు. తన కాన్ఫిడెంట్.. నిబద్ధత ఎంతో మందికి ఆదర్శం అంటూ పలువురు నెటిజన్లు ప్రదీప్ మెహ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.