పెనుబల్లి, సెప్టెంబర్ 6 : కేసీఆర్ వచ్చి తమను దీవిస్తే బాగుంటుందనుకున్న నూతన వధూవరులు.. ‘వాళ్లను కేసీఆర్ దీవిస్తున్నట్టుగా ఉన్న’ ఫొటోఫ్రేమ్ను అందుకొని పరవశించిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచందర్రావుబంజరకు చెందిన కంచు నర్సింహారావు – లక్ష్మీదివ్యశ్రీ కేసీఆర్కు వీరాభిమానులు. శనివారం రాత్రి వారి వివాహం జరుగనుండగా.. ‘మా కల్యాణానికి కేసీఆర్ వచ్చి మమ్ములను దీవిస్తే బాగుండు..’ అంటూ ఇటీవల వారి మిత్రులతో చర్చించారు.
దీంతో వారి ఆకాంక్షను గమనించిన వారి మిత్రులు.. ‘కేసీఆర్ వచ్చి ఆ నవదంపతులను దీవిస్తున్నట్టు’గా ఓ పెద్ద ఫొటోను రూపొందించారు. దానికి ఫ్రేమ్ తయారు చేయించి.. శనివారం రాత్రి వారి వివాహానంతరం వారికి బహుమతికిగా అందించారు. ఆ బహుమతిని చూసిన ఆ నవదంపతులు.. ఆనందంతో పరవశించిపోయారు. వివాహ క్రతువు పూర్తయిన తరువాత అదే పెళ్లిపందిరిలో కేసీఆర్ పాటలు పెట్టుకొని నూతన దంపతులతోపాటు వారి మిత్రులు నృత్యాలు చేశారు.