న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎల్జీ సక్సేనా మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. శుక్రవారం ఇద్దరి మధ్య లేఖల యుద్ధం నడిచింది. సూర్యుడు, చంద్రుడు ఎవరి పరిధుల్లో వారి పనిచేసినట్లుగానే, తమ పనిచేసుకునేందుకు ఎల్జీ అనుమతిస్తే ఢిల్లీ పరిపాలన సజావుగా సాగుతుందని కేజ్రీవాల్ హితవు పలికారు. ప్రభుత్వ వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడం మాని, దేశ రాజధానిలో శాంతి భద్రతలపై ఎల్జీ దృష్టిపెట్టాలని సూచించారు. కాగా, శుక్రవారం ఇద్దరి మధ్య జరుగాల్సిన వీక్లీ సమావేశం రద్దు కావడం గమనార్హం. జనవరి 16న రాజ్‌నివాస్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేజ్రీవాల్ నిరసన చేపట్టిన ఘటనపై ఎల్జీ లేఖ రాయడంతో వివాదం మొదలైంది. ఆ రోజు తాను కేజ్రీవాల్‌ను సమావేశానికి ఆహ్వానించానని, అయితే ఎమ్మెల్యేలతో కలిసి సమావేశానికి వస్తానని కేజ్రీవాల్ పట్టుబట్టాడని ఎల్జీ చెప్పారు. ఆ తర్వాత తనతో సమావేశమయ్యేందుకు నిరాకరించారంటూ కేజ్రీవాల్ మీడియా ముందు పేర్కొన్నారని ఆరోపించారు. అంత తక్కువ సమయంలో అంతమందితో సమావేశం సాధ్యం కాదని, అయితే దీనిపై కేజ్రీవాల్ రాజకీయం చేశారని ఆరోపించారు.
అసలు ఎల్జీ ఎవరు? అంటూ ఇటీవల అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడటంపైనా ఆయన స్పందించారు. రాజ్యాంగాన్ని పరిశీలిస్తే దీనికి సమాధానం దొరుకుతుందన్నారు. దీనిపై కేజ్రీవాల్ ఘాటుగా బదులిచ్చారు. ‘చంద్రుడు సరిగా పనిచేయలేదని భావించి, చంద్రుడి పని కూడా సూర్యుడు చేయడం మొదలు పెడితే భూమి అదుపుతప్పుతుంది. సూర్యుడి పని సూర్యుడు చేయాలి. చంద్రుడి పని చంద్రుడు చేయాలి. అప్పుడే వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. అలాగే ఎల్జీ కూడా మా పని మమ్మల్ని చేసుకోనిస్తే ఢిల్లీలో పాలన సజావుగా సాగుతుంది’ అని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఢిల్లీని లైంగిక దాడుల రాజధాని అని అంటున్నదని, దేశ రాజధానిలో నేరాలు పెరిగిపోతున్నాయని, ఎల్జీ ఈ విషయంపై దృష్టి సారించాలని ఎల్జీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ సూచించారు.