Lucknow | ఈసారి యూపీలో జరిగే ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. టిక్కెట్ల పంపిణీ, నియోజకవర్గాల ఎంపిక విషయంలో అధిష్ఠాన ఆచితూచి అడుగులు వేస్తోంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సారి బరిలోకి దిగుతారా? అయోధ్య నుంచా? మథుర నుంచా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎమ్మెల్సీగా ఉంటారా? అసలు బీజేపీ అధిష్ఠానం ఆయనకు టిక్కెట్ ఇస్తుందా….. ఇన్ని ఊహాగానాలు.. ఇన్ని ప్రచారాలు.. వీటన్నింటికీ బీజేపీ అధిష్ఠానం తెర దించేసింది. అయోధ్య సీటు నుంచి యోగి ఆదిత్యనాథ్ బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కూడా అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.
మొదట్లో మథుర నుంచి బరిలోకి దిగాలని భావించినా, ప్రస్తుత రాజకీయ అవసరాల దృష్ట్యా అయోధ్య నుంచే బరిలోకి దిగాలని ఆదిత్యనాథ్‌కు అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు సీనియర్లు, యూపీ సీఎం యోగి, ఇద్దరు డిప్యూటీ సీంఎలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే యోగిని అయోధ్య నుంచి బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఢిల్లీ వేదికగా జరిగిన కోర్ కమిటీ సమావేశంలో మరో చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయోధ్యతో పాటు మథుర నుంచి కూడా సీఎం యోగిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న కోణం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయోధ్యతో పాటు మథుర నుంచి కూడా యోగిని బరిలోకి దింపాలన్న అంశమూ పార్టీ పరిశీలనలోనే ఉందని యూపీ బీజేపీ నేతలు అంటున్నారు. అయోధ్య ద్వారా బరిలోకి దింపడం ద్వారా హిందుత్వ అంశాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లవచ్చని బీజేపీ అభిప్రాయంగా చెబుతున్నారు.
కాశీ, మథుర, అయోధ్య ఈ మూడు నగరాలపై బీజేపీ గంపెడన్ని ఆశలు పెట్టుకుంది. అయోధ్యలో ఇప్పటికే రామ మందిర నిర్మాణం ప్రారంభమైపోయింది. ఇక కాశీలో విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ను మోదీ మొన్ననే ప్రారంభించేశారు. మథుర వేదికగా కూడా బీజేపీ భారీ ఎత్తున పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. దీంతో ఈ మూడు నగరాలపై బీజేపీ పెద్దల కన్ను పడింది. ఇంతటి క్లిష్ట సమయంలో గోరఖ్‌పూర్‌పై మాత్రమే దృష్టి నిలపవద్దని, అయోధ్య లాంటి ధార్మిక నగరాలపై కూడా దృష్టి పెట్టాలని, ఈ ఎన్నికలకు అయోధ్య అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందనేది బీజేపీ వ్యూహకర్తల మాట.
సీఎం యోగి అయోధ్య నుంచి బరిలోకి దిగితే మరో సంకేతాన్ని కూడా ప్రజలకు, సానుభూతిపరులకు పంపించినట్లు ఉంటుందని వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయోధ్య నుంచి బరిలోకి దిగడం ద్వారా తమ మూలభూతమైన సిద్ధాంతం నుంచి బీజేపీ ఏమాత్రం తప్పుకోలేదన్న సంకేతాలు కూడా ఇచ్చినట్లవుతుందనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు.