Yogi Adityanath : మహా కుంభమేళా (Maha Kumbh) మరో రెండు రోజుల్లో ముగియనుండగా విమర్శకులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttarpradesh CM) యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకు ఏకంగా యూపీ అసెంబ్లీ (UP Assembly) నే వేదికగా చేసుకున్నారు. కుంభమేళా నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపించడం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్ చీఫ్ మమతాబెనర్జి, ఎస్పీ ఎంపీ జయాబచ్చన్ విమర్శలు చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో సీఎం యోగీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఆగ్రహం వెళ్లగక్కారు.
మహా కుంభమేళా ఒక నిక్షేప స్థానం (భాండాగారం) అని, దాని నుంచి ప్రజలు ఏది కోరుకుంటే అది దక్కిందని యోగీ ఆదిత్యనాథ్ ఆవేశంగా చెప్పారు. రాబందులకు శవాలు దొరికాయని, పందులకు రోత దొరికిందని వ్యాఖ్యానించారు. సున్నిత మనస్కులైన ప్రజలకు మానవ సంబంధాలకు సంబంధించి అందమైన చిత్రాలు దొరికాయని, వ్యాపారులకు వ్యాపారం నడిచిందని చెప్పారు. కోట్ల మంది భక్తులకు కుంభమేళాలో పరిశుభ్రమైన ఏర్పాట్లు దక్కాయని అన్నారు.
ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ హయాంలో జరిగిన కుంభమేళా గురించి యోగీ ప్రస్తావించారు. ‘మహా కుంభమేళాకు రాకుండా ఒక కులాన్ని పత్యేకంగా అడ్డుకున్నారని మీరు చెబుతున్నారు. కానీ ఏ కులాన్ని అడ్డుకోలేదు. సదుద్దేశంతో ఎవరైనా కుంభమేళాకు వెళ్లవచ్చు. దురుద్దేశంతో వెళ్లి అక్కడ కలకలం రేపాలనుకునే వాళ్లు కచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని యోగీ హెచ్చరిక దోరణితో అన్నారు.
‘మీ లాగా మేం విశ్వాసాలతో ఆడుకోం. మీ హయాంలో ముఖ్యమంత్రికి కుంభమేళాను చూసి సమీక్షించే సమయం లేదు. అందుకే సనాతని కాని వ్యక్తిని కుంభమేళాకు ఇన్చార్జిగా పెట్టారు. 2013 కుంభమేళాలో గొడవలు, అవినీతి జరగడానికి, కాలుష్యం పెరగడానికి, త్రివేణి సంగమంలో స్నానాలకు సరిపడా నీళ్లు లేకపోవడానికి అదే కారణం. కానీ ఇప్పుడు నేను స్వయంగా వెళ్లి మహాకుంభమేళాపై సమీక్ష చేశాను. ఇప్పటికీ చేస్తున్నాను. నాటి మారిషష్ ప్రధాని స్నానానికి నిరాకరించడమే అప్పటి నిర్వహణ లోపానికి నిదర్శనం’ అని అఖిలేష్ యాదవ్పై యోగి మండిపడ్డారు.
ఫిబ్రవరి నెల ఆరంభంలో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించినప్పటి నుంచి మహా కుంభమేళాపై విమర్శల దాడి పెరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. తొక్కిసలాటలో వేల మంది మరణించారని వ్యాఖ్యానించడం పార్లమెంట్లో తీవ్ర గందరగోళానికి తెరతీసింది. తొక్కిసలాట మరణించిన వారి మృతదేహాలను నదిలోకి విసిరేశారని ఎస్పీ ఎంపీ జయాబచ్చన్ ఆరోపించారు. మతం పేరుతో జరిగిన ఈ కూడిక మహా కుంభ్ కాదని మృత్యుకుంభ్ అని బెంగాల్ సీఎం మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ సాక్షిగా యోగి విమర్శకులపై విరుచుకుపడ్డారు.