Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు (Nimisha Priya) భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను రద్దు (Death Sentence) చేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. అక్కడ జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ఉరిశిక్షణ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
గతంలో వాయిదా వేసిన నిమిష ప్రియ మరణ శిక్షను రద్దు చేశారు. యెమెన్ రాజధాని సనాలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మరణ శిక్షను శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయించారని అబూబకర్ కార్యాలయం తన ప్రకటనలో వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి యెమెన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు వెల్లడికాలేదని, దీనిని నిర్ధారిస్తూ భారత విదేశాంగ శాఖ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ అత్యున్నత సమావేశంలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.
నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం తెలిపింది.
On the case of Nimisha Priya, an Indian national facing the death penalty in a murder case in Yemen, Indian Grand Mufti, Kanthapuram AP Abubakker Muslaiyar’s office says, “The death sentence of Nimisha Priya, which was previously suspended, has been overturned. A high-level… pic.twitter.com/jhNCG7CP3m
— ANI (@ANI) July 28, 2025
యెమెన్ జాతీయుడు మహద్ హత్యకేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. మహద్‌తో కలిసి ఆమె వ్యాపారం చేసింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె తన పాస్‌పోర్టు కోసం అడిగింది. కానీ పాస్‌పోర్టు ఇచ్చేందుకు మహద్ నిరాకరించడంతో అతడికి మత్తుమందు ఇచ్చి తీసుకునేందుకు నిమిష ప్రయత్నించింది. అయితే డోస్ ఎక్కువ కావడంతో మహద్ మరణించాడు.
దాంతో యెమెన్ పోలీసులు నిమిషను హత్య కేసులో అరెస్ట్ చేశారు. ఆమె ముందుగా స్థానిక కోర్టు మరణశక్ష విధించింది. ఆ శిక్షను టాప్ కోర్టు సమర్థించింది. దాంతో ఈ నెల 16న నిమిషకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నిమిషకు శిక్ష తప్పించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించిన భారత ప్రభుత్వం.. ఇక తాను చేసేదేమీ లేదని చేతులెత్తేసింది. జూలై 16న అమలు చేయాల్సిన మరణశిక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది.