Year Ender 2024 | రాజకీయంగా 2024 సంవత్సరంలో పార్టీలకు ఆశ్చర్యకరమైన ఫలితాలే వచ్చాయి. ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం అంత సులభం కాదని ఈ సంవత్సరంలో జరిగిన పలు ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. లోక్‌సభతో పాటు వివిధ అసెంబ్లీ ఎన్నికల వరకు రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించలేని విధంగా ఓటర్లు తమ తీర్పును ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలు.. ఓటర్ల తీర్పును ఓసారి గుర్తు చేసుకుందాం..!
ఈ ఏడాది 18వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందు దేశంలో బీజేపీ వేవ్ ఉందని ఆ పార్టీ నేతలు తెగ ప్రచారం చేశారు. ఈ సారి 400 సీట్ల నినాదంతో బీజేపీ ముందుకెళ్లింది. పలువురు రాజకీయ పండితులు సైతం బీజేపీ రికార్డు స్థాయిలో సీట్లు సాధించగలదని.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సీట్ల సంఖ్య తప్పనిసరిగా 400 మార్క్‌ని దాటుతుందని విశ్వసించారు. అయితే, ఫలితాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బీజేపీ గతంలో వచ్చిన సీట్ల సంఖ్యను సైతం అందుకోలేకపోయింది. కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే, తెలుగుదేశం పార్టీ, జేడీయూ, ఇతర మిత్రపక్షాల సహకారంతో బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీకి తగ్గిందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీ చెక్కుచెదరలేదని, ఇప్పటికీ ఆయన దేశంలోనే ప్రజామోదయోగ్యమైన నేత అని బీజేపీ వర్గాలు కొట్టిపడేశాయి. అయితే, సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి భారీ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ప్రతిపక్ష కూటమి ఆరోపించింది. ఎన్నికల ప్రచారంలో రాజ్యాంగం మార్పుపై భారీగా ప్రచారం చేసి విజయం సాధించింది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగింపు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం తదితర విప్లవాత్మక నిర్ణయాల తర్వాత బీజేపీ మెజారిటీ సంఖ్యను అందుకోలేకపోయింది. దేశంలోని హిందీ బెల్ట్ బీజేపీకి కంచుకోటగా భావిస్తుంటారు. అయితే, ఆశ్చర్యకరంగా హిందీ బెల్ట్‌లో ఉన్న అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. యూపీలో బీజేపీ కేవలం 33 సీట్లకే పరిమితమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 80 సీట్లకు 62 సీట్లు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
దేశంలో సంకీర్ణ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్రనే ఉన్నది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇక సంకీర్ణ రాజకీయాలు ముగింపు పలికినట్లేనని.. ఓటర్లు ఏ పార్టీకి నిర్ణయాత్మకమైన మెజారిటీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని అంతా భావించారు. కానీ, 2024 ఎన్నికల్లో ఓటర్లు మరోసారి స్పష్టమైన మెజారిటీ ఇస్తారని భావించారు. కానీ, ఓ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో మళ్లీ సంకీర్ణ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. రెండుసార్లు బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకోగా.. ఈ సారి ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది. అదే సమయంలో విపక్షాలు సైతం కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాన్ని ముమ్మరం చేశాయి.
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒడిశా ఎన్నికల ఫలితాలు మాత్రం ఈ సారి ప్రత్యేకంగా నిలిచాయి. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ పార్టీ 24 ఏళ్ల తర్వాత అధికారాన్ని కోల్పోయింది. ఒడిశాలో తొలిసారిగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో 78 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. నవన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ పార్టీ 51 సీట్లకు పరిమితమైంది. ఇక ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం తుడిచిపెట్టుకుపోయింది. అలాగే, ఈ ఏడాది హర్యానా అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో హర్యానాలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకత, రైతుల నిరసనల కారణంగా ఓటమిపాలయ్యే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేశారు. కానీ, ఆశ్చర్యకరంగా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించింది. నాయబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది. షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ‘మహాయుతి’ కూటమి ఘన విజయం సాధించింది. మరో వైపు ఓటర్లపైనే భారం వేసి.. సానుభూతితో బరిలోకి దిగిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే, ఈ రెండు పార్టీలకు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మంచి మెజారిటీయే లభించింది. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరి మాత్రం పెద్దగా ఓటర్లను ఆకర్షించలేకపోయాయి. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఆ తర్వాత బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సారి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు. అయితే, బీజేపీ ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీ వస్తుందని ఆశించింది. కానీ, ఆశ ఏమాత్రం ఫలించలేదు. అదే సమయంలో బీజేపీకి జార్ఖండ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఓటర్లు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో 37 సీట్లు గెలిచిన ఎస్పీ ఇటీవల.. ఏడుస్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమైంది.