న్యూఢిల్లీ, జనవరి 28 : బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వంపై ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానా ప్రభుత్వం తమకు సరఫరా చేస్తున్న నీటిలో విషం కలుపుతున్నదని, దీని కారణంగా రాజధానిలో సామూహిక మరణాల ప్రమాదం ఉందని సోమవారం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. దీని కారణంగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు ఆ కలుషిత నీటి సరఫరాను నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చునని చెప్పారు. ఈ ఆరోపణలను తిరస్కరించిన హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, ఎంపీ ధరంవీర్ సింగ్, ఇతర ఎంపీలు వారిపై మండిపడ్డారు. తమ గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ ఆరోపణలు హర్యానా ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ధరంవీర్ సింగ్ తెలిపారు.
కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు రుజువు చేసే వాస్తవిక ఆధారాలను చూపాలని భారత ఎన్నికల సంఘం ఆయనను కోరింది. యమునా నీటిని విషపూరితంగా మార్చే రసాయనాల స్వభావం, వాటి వివరాలను బుధవారం రాత్రి 8 గంటల్లోగా తమకు సమర్పించాలని ఒక లేఖలో ఆదేశించింది.