బెంగళూరు: ఒక జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. దీంతో ఆ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగడంతో పలువురు గాయపడగా కొందరు మరణించారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆ గుంతల రోడ్డుపై యముడు లాంగ్ జంప్ పోటీలు నిర్వహించాడు. (Yamaraja Conducts Long Jump Competition) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉడిపిని ప్రసిద్ధ మల్పే బీచ్‌ను కలిపే ఆది ఉడిపి-మల్పే రహదారి గుంతలమయంగా మారింది. దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగడంతోపాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, గుంతలతో ప్రమాదకరంగా మారిన ఆది ఉడిపి-మల్పే రహదారి దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. యముడు వేషం వేసిన వ్యక్తి నీటితో నిండిన ఆ గుంతల వద్ద లాంగ్ జంప్ పోటీలు నిర్వహించాడు. ఆ రోడ్డు వద్ద మరణించి దెయ్యంగా మారిన వ్యక్తులు పరుగెత్తుకుని వచ్చి ఆ గుంతల పై నుంచి జంప్ చేశారు. ఆ తర్వాత చిత్రగుప్తుడి వేషధారుడి సహాయంతో వారు జంప్ చేసిన దూరాన్ని టేప్‌తో యముడు కొలిచాడు.
మరోవైపు వినూత్న నిరసనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. గుంతలమయంగా మారిన ఆది ఉడిపి-మల్పే రహదారి దుస్థితిని పట్టించుకోని అధికారులు, పాలకుల నిర్లక్ష్యంపై కొందరు మండిపడ్డారు. ఇప్పటికైనా వారు స్పందించాలని, మరమ్మతులు చేపట్టాలని మరి కొందరు డిమాండ్ చేశారు.
Yamaraja conducts long jump competition for the dead in Udupi, Karnataka. pic.twitter.com/MLBxCuZoZn
— Karthik Reddy (@bykarthikreddy) August 27, 2024