న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు (AK Antony) అనిల్ ఆంటోని గురువారం బీజేపీలో చేరారు. దీనిపై ఏకే ఆంటోనీ స్పందించారు. ఇది తప్పుడు నిర్ణయమని, తనకు చాలా బాధ కలిగించినట్లు మీడియాతో అన్నారు. దేశాన్ని విభజించి ప్రజాస్వామ్య పునాదులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భావజాలానికి తాను ఎప్పటికీ మద్దతు ఇవ్వబోనని ఆయన చెప్పారు. మతపరమైన, విభజన ఎజెండా కలిగిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ను తుది శ్వాస విడిచే వరకు వ్యతిరేకిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి తాను విధేయుడినని స్పష్టం చేశారు. దేశాన్ని ఏకతాటిపై ఉంచడంతోపాటు భిన్నత్వాన్ని గౌరవించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
కాగా, రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించిన ఇందిరా గాంధీ నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు ఏకే ఆంటోనీ తెలిపారు. అయితే విధానపరమైన విషయంలో ఒక్కసారి మాత్రమే ఆమెతో విభేదించినట్లు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి ఆమెను మరింతగా గౌరవించినట్లు వెల్లడించారు. ‘రాజకీయ జీవితం చివరి దశలో నేను ఉన్నాను. ఎంతకాలం బతుకుతానో తెలియదు. కానీ నేను జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ కోసం బతుకుతాను’ అని అన్నారు. తన కుమారుడి చర్యపై ఇకపై మాట్లాడబోనని, తన వ్యక్తిగతాన్ని మీడియా గౌరవించాలని కోరారు.
Ak Antony’s Son Anil Antony
మరోవైపు బీజేపీలో చేరిన అనిల్ ఆంటోనీ కాంగ్రెస్‌పై పలు విమర్శలు చేశారు. ‘ఒక కుటుంబం కోసం పనిచేస్తున్నామని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నమ్ముతారు. కానీ దేశం కోసం పనిచేస్తున్నానని నేను నమ్ముతున్నాను. బహుళ ధ్రువ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామి స్థానంలో ఉంచడంపై ప్రధాని నరేంద్ర మోదీకి చాలా స్పష్టమైన దృష్టి ఉంది’ అని మీడియాతో అన్నారు. 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం నేపథ్యంలో అనిల్ ఆంటోనీ ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడారు. గురువారం ఆయన బీజేపీలో చేరారు.
Also Read: