న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ శనివారం హర్యానాలోని శంభు సరిహద్దుల్లో రైతుల నిరసనలో పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ.. “మీ అమ్మాయి మీతోనే” ఉంటుందని వారి పోరాటానికి మద్దతు పలికారు. పంటలకు కనీస మద్దతు ధర తదితర డిమాండ్లతో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసన 200వ రోజుకు చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వినేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎంతో కాలం నుంచి సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నప్పటికీ రైతుల శక్తి సామర్థ్యాలు తగ్గలేదని ప్రశంసించారు. రైతు కుటుంబంలో జన్మించడం తనకు గర్వకారణమని చెప్పారు.
మన హక్కుల కోసం మనమే పోరాడాలని, మన కోసం ఇతరులు ఎవరూ రారని అన్నారు. హక్కులను తీసుకోకుండా వెనుకకు వెళ్లకూడదన్నారు. రైతుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు సంఘం నేత సర్వణ్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ, తమ శాంతియుత నిరసన తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. తమ ధర్నాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రానున్న హర్యానా శాసన సభ ఎన్నికల కోసం తాము ఓ వ్యూహాన్ని రచిస్తామని ఈ నేతలు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర రాజకీయ యవనికపై చురుకైన పాత్ర పోషించే ఉద్దేశాన్ని కనబరిచారు.