న్యూఢిల్లీ: ఇండియన్ రెజ్లర్ వినేశ్ ఫోగట్(Vinesh Phogat)ను.. హర్యానా కాప్ పంచాయతీ స్వర్ణ పతకంతో సత్కరించింది. ఆదివారం ఆమె బర్త్‌డే సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో.. 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో.. వినేశ్ ఫోగట్ ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే గోల్డ్ మెడల్ మ్యాచ్ జరగాల్సిన రోజు.. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఆమె కోల్పోయింది.
ఒలింపిక్స్ ఫైనల్లో అర్హత కోల్పోయినా.. స్వదేశంలో మాత్రం వినేశ్‌కు ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆమె పుట్టిన రోజు నేపత్యంలో సర్వకాప్ పంచాయతీ ఆమెను స్వర్ణ పతకంతో సత్కరించింది. అనర్హత వేటు వల్ల నిరాశకు గురైనా.. తనకు దక్కిన వెల్కమ్ వల్ల సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. తన పోరాటం ఆగలేదని, అది ఇప్పుడే మొదలైందని వినేశ్ పేర్కొన్నది.
అనర్హత వేటును ప్రశ్నిస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో వినేశ్ కేసు దాఖలు చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే వారం రోజుల పాటు విచారణ చేపట్టిన తర్వాత.. వినేశ్ అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది.