న్యూఢిల్లీ : నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ఇంజినీర్లు బియ్యం గింజ కన్నా చిన్న పరిమాణంలో పేస్‌మేకర్‌ను అభివృద్ధి చేశారు. ఇది సిరంజి కొనలో ఇమిడిపోగలదు. దీనిని శరీరంలో అమర్చడానికి సూదుల వంటి సంప్రదాయ పద్ధతులను అవలంబించవలసిన అవసరం లేదు. సంప్రదాయ పేస్మేకర్లకు వైర్లు అవసరమవుతాయి. దీనిని శరీరం నుంచి తొలగించాలంటే మరోసారి శస్త్ర చికిత్స తప్పనిసరి. కానీ తాజాగా అభివృద్ధిపరచిన పేస్‌మేకర్‌కు అటువంటివేవీ అవసరం లేదు. దాని అవసరం లేదనుకున్నపుడు శరీరంలో దానంతట అదే కరిగిపోతుంది. ఈ డివైస్‌ను అభివృద్ధి చేసిన బృందానికి నాయకత్వం వహించిన జాన్ ఏ రోగర్స్ మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అతి చిన్న పేస్‌మేకర్ అని చెప్పారు. శిశువులకు గుండె శస్త్ర చికిత్స చేయాలంటే, పేస్‌మేకర్ ఎంత చిన్నదైతే అంత మంచిదని తెలిపారు.
ఈ పేస్‌మేకర్‌ను చిన్న వైర్లెస్ వేరబుల్ ప్యాచ్‌తో రోగి ఛాతీపై అమర్చుతారు. గుండె కొట్టుకోవడంలో లోపాలు ఈ ప్యాచ్ గుర్తించి, కాంతి సంకేతాలను పేస్‌మేకర్‌కు పంపిస్తుంది. పేస్‌మేకర్ క్రియాశీలమై, తుంది. సున్నితమైన కాంతి సంకేతాలు చర్మం, కండరాల గుండా ప్రయాణించి, గుండె కొట్టుకునే లయను నియంత్రిస్తాయి. ఈ పేస్‌మేకర్‌కు చిన్న బ్యాటరీ కూడా ఉంది. విద్యుత్తు శక్తిని సృష్టించేందుకు శరీర ద్రవాలను వినియోగించుకుంటుంది.