Diamond Battery | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సాధారణ బ్యాటరీ లైఫ్ ఎంతకాలం ఉంటుంది? ఒకటి లేదా రెండేండ్లు. అయితే, బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీకి చెందిన పరిశోధక బృందం అభివృద్ధి చేసిన బ్యాటరీ ఏకంగా 11 వేల ఏండ్లకు పైగా నడుస్తుంది. దీన్ని ‘డైమండ్ బ్యాటరీ’గా పిలుస్తున్నారు.
సోలార్ ప్యానెల్స్ సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చినట్టే, కార్బన్-14 రేడియోయాక్టివ్ ఐసోటోప్ రేడియేషన్ సాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేసే బ్యాటరీనే ‘డైమండ్ బ్యాటరీ’గా పిలుస్తున్నారు. ‘కార్బన్-14’ నిరంతరాయంగా 11,400 ఏండ్లపాటు రేడియేషన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డైమండ్ బ్యాటరీ కూడా అంతేకాలంపాటు విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ బ్యాటరీ వేసిన డివైజ్ 11,400 ఏండ్లపాటు నిరంతరాయంగా పనిచేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
హార్ట్ రేటును క్రమబద్ధీకరించే పేస్మేకర్లు బ్యాటరీ ఆధారంగానే పనిచేస్తాయి. బ్యాటరీలో పవర్ అడుగంటినప్పుడు వాటిని తరుచూ మార్చడం కష్టమౌతుంది. ఈ సందర్భాల్లో ఏండ్లపాటు నిరంతరాయంగా పనిచేసే డైమండ్ బ్యాటరీని వినియోగించవచ్చు. అంతేకాకుండా వినికిడి సమస్యలు ఉన్నవారు వాడే హియరింగ్ ఎయిడ్స్‌తో పాటు రోదసి ప్రయోగాల్లో స్పేస్‌క్రాఫ్ట్, శాటిలైట్స్ పనిచేయడానికి వాడే బ్యాటరీలు కూడా నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. వీటికి కూడా డైమండ్ బ్యాటరీ ఓ చక్కటి ప్రత్యామ్నాయమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.