దుబాయ్ : ప్రపంచంలోనే తొలిసారిగా దుబాయ్‌లో ఒక కృత్రిమ మేధస్సు (ఏఐ) నిర్వహించే రెస్టారెంట్ ప్రారంభం కానుంది. సృజనాత్మకత, సాంకేతికతను మిళితం చేసిన షడ్రుచులతో చక్కని ఆహారాన్ని ఆరగించడానికి భోజన ప్రియులను ఆహ్వానిస్తున్నది. బుర్జ్ ఖలీఫా వీక్షణతో ఉండే ఈ రెస్టారెంట్ ఈ సెప్టెంబర్‌లో కెంపెన్స్కీలోని ది బౌలోవార్డ్లో ప్రారంభం కానుంది. వూహు పేరుతో ఉండే ఈ రెస్టారెంట్‌ను యూఏఈ స్టార్టప్ యూఎంఏఐ అభివృద్ధి చేసింది.
ఏఐ ఆధారిత పాకశాస్త్ర నమూనా చెఫ్ అయిన ఐమాన్ నేతృత్వంలో ఇది నడుస్తుంది. వేలాది ప్రపంచ వంటకాలపై ఈ ఏఐ చెఫ్ ఐమాన్ శిక్షణ పొందినట్టు సంస్థ తెలిపింది. దీనిలో పాక అంశాలను విశ్లేషించడానికి ప్రోగ్రామ్ చేసి ఉందని వివరించింది. అయితే మానవ చెఫ్‌లు కూడా ఈ ప్రక్రియలో అంతర్భాగంగా ఉంటారని పేర్కొంది. ఏఐ చెఫ్ ఆదేశాల మేరకు ఎంత మొత్తంలో ఏయే దినుసులు వేయాలి, వాటిని ఎలా కలపాలి, ఎలా తయారు చేయాలో చెబితే వాటిని వీరు సిద్ధం చేస్తారు. వంటలను ప్రముఖ చెఫ్ రీఫ్ ఒత్మాస్ నేతృత్వంలోని వంటగది బృందం పరీక్షించి నిర్ధారిస్తుంది.