AI Doctor Clinic | న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డాక్టర్ క్లినిక్ ప్రారంభమైంది. చైనాలోని మెడికల్ టెక్నాలజీ సంస్థ సైనీ ఏఐ, సౌదీ ఆరోగ్య సంస్థ అల్మూసా హెల్త్ గ్రూప్ కలిసి ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అల్-అహ్సా ప్రాంతంలో గత నెలలోనే ఈ క్లినిక్ ప్రారంభమైంది. డాక్టర్ హువా అనే ఏఐ ఆధారిత డాక్టర్ ఇక్కడ సేవలు అందిస్తుంది. ఉబ్బసం, గొంతునొప్పి వంటి 30 రకాల జబ్బులకు ఏఐ డాక్టర్ చికిత్స అందిస్తుంది.
రోగులు తమ లక్షణాలను ట్యాబ్లెట్ ద్వారా వివరిస్తే, డాక్టర్ హువా వాటిని విశ్లేషించి చికిత్స సూచనలు అందిస్తుంది. ఈ విధానం రోగులకు వేగవంతమైన, కచ్చితమైన వైద్య సేవలను అందించడంలో సహాయపడుతుంది. ఏఐ కూడా పరిష్కరించలేని అత్యవసర కేసులను చూసేందుకు నిజమైన వైద్యులు కూడా ఈ క్లినిక్‌లో అందుబాటులో ఉంటారు. ఈ క్లినిక్ ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంలో కీలక ముందడుగు అవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది భవిష్యత్తులో వైద్య సేవల అందుబాటును పెంచడంలో, వైద్యులపై భారం తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్తున్నారు.