పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మొబైల్ ఫోన్ వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పదేళ్లలో ప్రపంచం అంతం అవుతుందని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గురువారం అసెంబ్లీలో ఆర్జేడీ ఎమ్మెల్యే కుమార్ కృష్ణ మోహన్ మొబైల్ ఫోన్ వినియోగించడాన్ని సీఎం నితీశ్ కుమార్ గమనించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాగా, అసెంబ్లీలో మొబైల్ ఫోన్లను నిషేధించిన విషయాన్ని నితీశ్ కుమార్ గుర్తు చేశారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు. ‘ఇంతకుముందు మనం చాలా చూసేవాళ్ళం. ఇబ్బంది వస్తుందని తెలుసు కాబట్టి 2019లో నిషేధించాం. ఇలాగే (మొబైల్ ఫోన్ల వాడకం) కొనసాగితే వచ్చే పదేళ్లలో ప్రపంచం అంతం అవుతుంది’ అని అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు నేను ఏమి విన్నాను? మొబైల్ ఫోన్ల వల్ల పదేళ్లలో ప్రపంచం అంతం అవుతుందని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి పేర్కొన్నారా? పిచ్చితనం. అర్ధంలేని మాటలు మాట్లాడటానికి ఒక పరిమితి ఉంది!’ అని విమర్శించారు.
కాగా, సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై బీహార్‌లోని ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. ‘నిరక్షరాస్యులైన సీఎం’ అని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ‘టెక్నాలజీని వ్యతిరేకించడమే కాకుండా యువత, విద్యార్థులు, మహిళలను కూడా వ్యతిరేకించే ఇంత తిరోగమన, కాలం చెల్లిన సీఎం బీహార్‌లో ఉండటం దురదృష్టకరం. సిగ్గుచేటు’ అని ఎక్స్‌లో మండిపడ్డారు.
What did I hear just now? A CM stating in Assembly that the world shall end in ten years because of mobile phones?
पागलपन और फेंकने की भी हद्द होती है! pic.twitter.com/3ToBGOsVJL
— Abhishek Singhvi (@DrAMSinghvi) March 20, 2025