Germany To India | ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా ఉత్పత్తులపై అమెరికా, దాని మిత్ర దేశాలు నిషేధం విధించినా జర్మనీ భిన్నంగా స్పందించింది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోకుండా భారత్‌కు సుద్దులు చెప్పలేమని భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలుసుకోగల సామర్థ్యం ఉన్నవారెవరైనా ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెర దించడానికి సాయ పడాలని కోరారు.
రష్యా ముడి చమురు, బొగ్గు దిగుమతులపై పలు యూరప్ దేశాలు ఆధారపడి ఉన్నాయన్న అంశాన్ని కొట్టి పారేయలేం. కానీ ఏ పొరుగు దేశంపైనైనా పుతిన్ భవిష్యత్‌లో ఒకరోజు దాడి చేస్తారో తాము చెప్పలేమని వాల్డర్ అన్నారు. ఇప్పటికే రష్యా నుంచి భారీగా దిగుమతులు తగ్గించుకున్నామన్నారు. ఈ ఏడాది చివరికల్లా ముడి చమురు కోసం రష్యాపై ఆధారపడటం పూర్తిగా తగ్గించుకుంటామని చెప్పారు.
రష్యా ముడి చమురు భారత్ కొనుగోలు చేయడంపైనా వాల్టర్ జే లిండ్నర్ స్పందించారు. ప్రతి దేశానికి సొంత అవసరాలు ఉంటాయి. సొంత చరిత్ర ఉంటుంది. ఇక్కడ హితబోధలు చేసేదేమీ లేదు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి చరమ గీతం పాడేందుకు రష్యాపై మేం ఆంక్షలు విధించాం. వాటిని వినియోగిస్తాం అని చెప్పారు.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయొద్దని భారత్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్నది. కానీ గత శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ దేశ ప్రయోజనాలు, ఇంధన భద్రత కోసం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.