Sanjay Raut | ఈడీ ముందు మంగళవారం మాత్రం విచారణకు హాజరు కాలేనని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ చెప్పారు. ఆలీబాగ్‌లో సమావేశానికి తాను హాజరు కావాల్సి ఉందని సోమవారం తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తనకు ఈడీ సమన్లు రాగానే సంజయ్ రౌత్ స్పందించారు. తనకు ఈడీ సమన్లు జారీ కావడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.
పెద్ద పోరాటం నుంచి తనను నిలువరించేందుకే ఈడీ సమన్లు జారీ అయ్యాయని సంజయ్ రౌత్ అన్నారు. ఒకవేళ తన తల నరికినా `గువాహటి రూట్`లో వెళ్లను అని సంజయ్ రౌత్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. బాలా సాహెబ్ ఠాక్రే శివసైనిక్ల మధ్య భారీ యుద్ధం సాగుతున్నదని చెప్పారు.
మనీ లాండరింగ్ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావలని సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏక్నాథ్ షిండే సారధ్యంలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గువాహటిలో క్యాంప్ ఏర్పాటు చేసుకోవడంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ సమయంలో సంజయ్ రౌత్‌కు ఈ సమన్లు జారీ కావడం గమనార్హం.