Kerala : మహిళల గురించి కేరళకు చెందిన ఒక ముస్లిం మతగురువు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆడవాళ్లు ఇంటికే పరిమితం కావాలని సూచించాడు. మత గురువు, కాంతాపురం సమస్థ కేరళ జామియ్యతుల్ ఉలామా జనరల్ సెక్రెటరీ ఏపీ అబూబాకర్ ముస్లియార్ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం కోచిలోని, కాంతాపురంలో ఒక మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గతవారం ఈ సంస్థ తరఫున ఒక ఆదేశం జారీ చేశారు. దీని ప్రకారం.. మహిళలు మత పరమైన కార్యక్రమాలు, ఇతర వేడుకల్ని నాలుగు గోడల మధ్య, ఇంట్లోనే నిర్వహించుకోవాలి. మగవారితో కలిసి మహిళలు ఎలాంటి బహిరంగ వేదిక పంచుకోకూడదు. అలాగే, ప్రజలకు సంబంధించిన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అయితే, ఈ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కేరళకు చెందిన పలువురు మహిళా నేతలు ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు బయటకు రాకుండా ఉండేలా ఆదేశించడంపై మండిపడ్డారు.
ఇప్పుడు ఇదే అంశంపై ఆ ముస్లిం సంస్థకు చెందిన మత గురువు అబూబాకర్ స్పందించాడు. ఈ ఆదేశాల్ని సమర్ధించాడు. మహిళలు ఇంటికే పరిమితం కావాలని సూచించాడు. మగవారితో బహిరంగ వేడుకల్ని పంచుకోకూడదన్నాడు. వారు బయటకు రావడం వల్ల భారీ వినాశనం సంభవిస్తుందని, దానిని నివారించేందుకే పరదాల్ని సూచించిందని అబూబాకర్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి విషయాలు చెప్పడంలో తమను ఎవరూ ఆపలేరని అతడు అన్నాడు.
తాము ఎన్నో ఏళ్లుగా మతాన్ని అనుసరిస్తున్నామని, అందువల్ల తమకు అలా చెప్పే అధికారం ఉందని వివరించాడు. అయితే, అతడి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.