న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దు అని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ పార్టీకి అనుకూలం కాదు అన్నారు. దానికి రాజకీయ రంగు పూయవద్దు అన్నారు. ఎవరు బాధ్యులైనా, ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆలస్యం చేశామన్నారు. ఈ బిల్లులను తీసుకువచ్చిన సక్సెస్ ట్రెజరీ బెంచ్‌లకు కానీ, మోదీకి కానీ దక్కదని, ఇది భారత ప్రజాస్వామ్యానికి దక్కుతుందని ఆయన అన్నారు. ఇవాళ లోక్‌సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో క్రెడిట్ ఎవరిదన్న దానిపై ఆలోచించరాదు అన్నారు. కావాలంటే మీరు క్రెడిట్ తీసుకోవచ్చు అని ఆయన ప్రతిపక్షాలకు చెప్పారు. ముందుగా 33 శాతం మంది మహిళలు ఇక్కడకు రావాలన్నారు. భారతీయ సోదరీమణులను నమ్మండి అని, వారి ఇంటెలిజెన్స్‌ను గుర్తించాలన్నారు. నారీ శక్తి వికసిత్ భారత్‌కు ఉపయోపడుతుందన్నారు. మనం తీసుకోబోయే నిర్ణయాన్ని మహిళలు వీక్షిస్తున్నారని, మన ఉద్దేశాలను కూడా గమనిస్తున్నారన్నారు.మహిళా రిజర్వేషన్ ప్రక్రియను మరింత ఆలస్యం చేయవద్దు అన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లులతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు అని, ఎవర్నీ వివక్షపూరితంగా చూడబోమన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో తనకు క్రెడిట్ అవసరం లేదని మోదీ అన్నారు. ఒకవేళ బిల్లు పాసైన తర్వాత.. ఎవరైనా కావాలంటే వారి పేరు, ఫోటో మీద ఫుల్ పేజీ యాడ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అందరి అచీవ్‌మెంట్‌గా చూడాలన్నారు. ఇది ఏ ఒక్క వ్యక్తి, లేదా రాజకీయ పార్టీకి చెందిన సక్సెస్ కాదన్నారు. రాజకీయంగా తనకు లబ్ధి జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. కానీ ఒకవేళ మూడు దశాబ్ధాల తర్వాత కూడా ఈ సంస్కరణ చేపట్టకపోతే, అప్పుడు ఆ లబ్ధి ఏ పార్టీకి దక్కదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించేవారు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటారన్నారు.
డీలిమిటేషన్ అంశంలో గ్యారెంటీ ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. గ్యారెంటీ, ప్రామిస్ పదాలు వాడమంటే వాడుతానని, ఒకవేళ తమిళంలో దీనికి తగిన పదం ఏదైనా ఉందంటే దాన్ని కూడా చెబుతానని, మన ఉద్దేశం స్వచ్ఛమైందైతే, అప్పుడు పదాలతో ఆడాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు.