న్యూఢిల్లీ: గృహ హింస నుంచి మహిళల పరిరక్షణ చట్టం, 2005 ప్రకారం నమోదైన కేసులను హైకోర్టులు రద్దు చేయవచ్చునని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దీని కోసం సీఆర్పీసీ సెక్షన్ 482 లేదా భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 528 ప్రకారం హైకోర్టులకు అధికారం ఉందని తెలిపింది. ఈ చట్టం క్రూరత్వం, హింస నుంచి మహిళలను కాపాడేందుకు రూపొందించిన ప్రత్యేక చట్టం అయినప్పటికీ, కోర్టులకు స్వతఃసిద్ధంగా ఉన్న అధికారాలను వినియోగించడాన్ని ఈ చట్టం నిషేధించబోదని వివరించింది.
న్యాయపరమైన లక్ష్యాలను సాధించడానికి ఈ అధికారాలను వినియోగించి, కేసులను రద్దు చేయవచ్చునని తెలిపింది. ముఖ్య ంగా పసలేని, నిష్కారణ నిందారోపణలు గల, చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నట్లుగా కనిపించే ఫిర్యాదులను రద్దు చేయవచ్చునని స్పష్టం చేసింది. పార్టీలు ఓ పరిష్కారానికి వచ్చినపుడు, విచారణను కొనసాగించడం వల్ల ప్రయోజనం లేనపుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని తెలిపింది. గృహ హింస నిరోధక చట్టం క్రింద నమోదైన కేసులో ఫిర్యాదుదారుతో రాజీ కుదిరిందని, విచారణను రద్దు చేయాలని ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.