భువనేశ్వర్: పోలీస్ స్టేషన్లో కూడా మహిళలకు రక్షణ లేదని ఒడిశా మాజీ సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) విమర్శించారు. రాజ్‌భవన్‌లో ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం బీజేడీ ప్రధాన కార్యాలయం శంఖ భవన్లో కేంద్రపారా, గజపతి జిల్లాల పార్టీ నేతలతో నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒడిశాలో శాంతి భద్రతలు దిగజారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15న ఆర్మీ అధికారికి కాబోయే భార్యను భరత్పూర్ పోలీస్ స్టేషన్లో కొట్టి లైంగికంగా వేధించడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘భువనేశ్వర్‌లోని పోలీస్ స్టేషన్ల లోపల కూడా మహిళలకు భద్రత లేకపోవడం, రాజ్‌భవన్‌లో ప్రభుత్వ అధికారిని గవర్నర్ కుమారుడు కొట్టడం బాధాకరం. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని తెలుస్తోంది’ అని అన్నారు.
కాగా, ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన నవీన్ పట్నాయక్, బీజేడీ షెడ్యూల్డ్ క్యాస్ట్ సెల్‌ను ఉద్దేశించి మాట్లాడారు. సుభద్ర యోజన, పెన్షన్, అలవెన్సులు, ఉచిత విద్యుత్ గురించి బీజేపీ ఇచ్చిన ‘తప్పుడు’ ఎన్నికల వాగ్దానాల గురించి అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ రూ. 50,000 అందజేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ చాలా మంది మహిళలకు ఈ అవకాశాన్ని నిరాకరించిందని ఆరోపించారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 3,500 వృద్ధాప్య పెన్షన్‌పై బీజేపీ ఇచ్చిన అబద్ధాల వాగ్దాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ నేతలకు సూచించారు.