Mysore woman : సోషల్ మీడియా (Social Media) హవాతోపాటు యువతలో రీల్స్ (Reels) పిచ్చి కూడా పెరిగిపోతోంది. చాలామంది అందరికంటే భిన్నంగా రీల్స్ చేయడం కోసం ఆరాటపడుతున్నారు. రైల్వేస్టేషన్లలో, బస్స్టేషన్లలో, రోడ్లపైన, రైల్వే ట్రాక్ల పక్కన రీల్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలోని మైసూరులో కూడా ఓ యువతి అలాంటి దుస్సాహసమే చేసింది.
ఏకంగా దసరా ఏనుగులతో ఓ యువతి రీల్స్ చేసింది. సాధారణంగా మావటీలు, కాపలాదారులు తప్ప ఇతరులు ఎవరూ దసరా ఏనుగుల వద్దకు వెళ్లేందుకు అనుమతించరు. కానీ ఆ యువతి వాటి దగ్గరకు వెళ్లి రీల్స్ చేసింది. అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియాలో పెట్టింది. దాంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
ఆ యువతి రాత్రి సమయంలో వచ్చి ఏనుగుల వద్ద డ్యాన్సులు చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంది. ఆ సమయంలో అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకోకపోవడం గమనార్హం. ఆ యువతి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. విషయం పెద్దది అవుతుండటంతో ఆమె వీడియోలను తొలగించింది. అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రీల్స్ చేసిన యువతి కోసం గాలిస్తున్నారు.