బెంగళూరు, నవంబర్ 16: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో మహిళలకు భద్రత కరువవుతున్నది! నేరగాళ్లు మహిళలను వెంబడించి వేధిస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 8న రాత్రివేళ కొందరు ఉద్యోగినులకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. కొందరు మగవాళ్లు వాళ్లు ప్రయాణిస్తున్న కారును వెంబడించారు. బాధితుల్లో ఒకరి భర్త శ్రీజన్ ఆర్ షెట్టి ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కొందరు తమకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావించారు. శ్రీజన్ ఆర్ షెట్టి జరిగిన ఘటన గురించి ఇలా పోస్ట్ చేశారు… ‘నేనెప్పుడూ బెంగళూరులో అభద్రతకు లోనవలేదు. కానీ రాత్రి పది గంటల తర్వాత నగరంలోని కొన్ని ప్రాంతాలు ఎంత సురక్షితం కావో గత బుధవారం తెలిసొచ్చింది.
ఈ నెల 8న నా భార్య తన ఇద్దరు సహోద్యోగినులు, ఒక సహోద్యోగికి సర్జాపూర్ నుంచి క్యాబ్ దొరకడం కష్టమని డ్రాప్ ఆఫర్ చేశారు. వారి కారును ఒక గుంపు కొన్ని కిలోమీటర్ల వరకు వెంబడించింది’ అని ఆయన తెలిపారు. నిందితులు తన భార్యను, ఆమె సహోద్యోగులను కారులోంచి దిగమని అడిగినా వారు కారు దిగలేదని.. కొందరు టెంపో డ్రైవర్లు తన భార్య కారును ఢీ కొట్టి కిందకు దిగమని ఒత్తిడి చేశారని శ్రీజన్ తెలిపారు. ఈ తతంగాన్ని చూస్తున్న వారెవరూ కారులోని వారికి సాయం చేయలేదని శ్రీజన్ వాపోయారు. అయితే తన భార్య తెలివిగా వ్యవహరించి ప్రధాన రహదారిలో కారును ఆపి విషయాన్ని పోలీసులకు తెలిపిందని చెప్పారు. ‘పోలీసులను, నన్ను, తన పది మంది స్నేహితులను ఘటనా స్థలికి రావాలని ఆమె కోరకపోయుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ నగరానికి ఇప్పుడే భద్రత కావాలి. సర్జాపూర్ ఇలాంటి ఘటనలకు కేంద్ర బిందువైంది, ఇలాంటివాటికి మనం పరిష్కారం కనుక్కోవాలి’ అని శ్రీజన్ పోస్ట్ చేశారు. శ్రీజన్ పోస్టుపై స్పందించిన నెటిజన్లు తమకు ఎదురైన అలాంటి ఇబ్బందికర ఘటనలను షేర్ చేశారు.
తెలంగాణలోని హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో నిత్యం సంచరిస్తూ మహిళల భద్రతకు భరోసా ఇస్తున్నారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణం ప్రతిస్పందిస్తున్నారు.