లక్నో: ఒక మహిళ నాలుగు నెలల కిందట అదృశ్యమైంది. అయితే జిల్లా కలెక్టర్ బంగ్లా, ఇతర ప్రభుత్వ అధికారుల నివాసాలు ఉన్న వీవీఐపీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభించింది. నిందితుడైన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. (Woman Body Found in VVIP Area) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. జూన్ 24న వ్యాపారవేత్త భార్య అదృశ్యమైంది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాన్పూర్‌లోని రాయ్‌పూర్వా ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ విమల్ సోనీ వద్దకు ఆమె చివరిగా వెళ్లినట్లు గుర్తించారు. మహిళ అదృశ్యమైన తర్వాత మాయమైన అతడి కోసం పూణే, ఆగ్రా, పంజాబ్‌లో పోలీస్ బృందాలు వెతికాయి. అయితే విమల్ మొబైల్ ఫోన్ వాడకపోవడంతో అతడి ఆచూకీ గుర్తించడం ఆలస్యమైంది.
కాగా, చివరకు నిందితుడు విమల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా ఆ మహిళను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. తనకు పెళ్లి సంబంధం కుదరడంతో ఆమె సంతృప్తి చెందినట్లు తెలిపాడు. ఈ అంశంపై మాట్లాడేందుకు తామిద్దరం కారులో వెళ్లినట్లు చెప్పాడు. వాగ్వాదం సందర్భంగా మహిళ మెడపై తాను పంచ్ ఇవ్వడంతో స్పృహతప్పిందని, దీంతో ఆమెను హత్య చేసినట్లు వెల్లడించాడు. అనంతరం మహిళ మృతదేహాన్ని జిల్లా కలెక్టర్ బంగ్లా, ఇతర ప్రభుత్వ అధికారుల నివాసాలు ఉన్న వీవీఐపీ ప్రాంతంలో పాతిపెట్టినట్లు చెప్పాడు.
మరోవైపు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుడు విమల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళను చంపిన తర్వాత ఆమె ధరించిన బంగారు ఆభరణాలను విమల్ దొంగిలించాడా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.