ముంబై: ఒక మహిళ తన కుమార్తె గొంతునొక్కి చంపింది. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. (Mother Strangles Daughter) ఆమె భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఘన్సోలీ ప్రాంతంలో నివసించే 26 ఏళ్ల ప్రియాంక కాంబ్లే దారుణ నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ 23న రాత్రి వేళ నిద్రిస్తున్న ఆరేళ్ల కుమార్తె వైష్ణవి గొంతునొక్కి హత్య చేసింది. ఆ తర్వాత సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తల్లీ, కుమార్తె మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొంతునొక్కడం వల్ల ఆరేళ్ల బాలిక మరణించినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే అధిక బీపీతో బాధపడుతున్న తన భార్య మానసిక ఒత్తిడికి గురవుతున్నదని ప్రియాంక భర్త పోలీసులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.