భోపాల్: ఒక మహిళా సర్పంచ్ (Woman Sarpanch) ఆ హక్కులను ఒక వ్యక్తికి అప్పగించింది. ఇకపై సర్పంచ్ అధికారాన్ని ఆ గ్రామస్తుడు నిర్వహిస్తాడని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒప్పందం గురించి స్టాంప్ పేపర్‌పై వారిద్దరూ సంతకాలు చేశారు. ఈ విషయం తెలిసిన అధికారులు ఆ మహిళా సర్పంచ్‌కు నోటీస్ జారీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మానస జనపద్ పరిధిలోని దాతా గ్రామానికి చెందిన కైలాషి బాయి కచావా సర్పంచ్‌గా ఎన్నికైంది.
కాగా, అదే గ్రామానికి చెందిన సురేష్ గరాసియాకు తన సర్పంచ్ హక్కులను కైలాషి బాయి అప్పగించింది. జనవరి 24న వీరిద్దరి మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. సాక్షుల సమక్షంలో రూ.500 స్టాంప్ పేపర్‌పై సంతకాలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వాటర్‌షెడ్ మిషన్ మొదలైన పథకాల పనులను ఇకపై సర్పంచ్‌గా సురేష్ నిర్వహిస్తాడని అందులో పేర్కొన్నారు.
అలాగే సర్పంచ్ విధుల్లో తాను జోక్యం చేసుకోబోనని, అవసరమైన సంతకాలు తాను చేస్తానని కైలాషి బాయి హామీ ఇచ్చింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన వ్యక్తి నాలుగు రెట్లు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆ బాండ్లో పేర్కొన్నారు. అయితే ఎంత మొత్తం చెల్లించాలి అన్నది అందులో ప్రస్తావించలేదు.
మరోవైపు మహిళా సర్పంచ్ కైలాషి బాయి తన అధికారాలు, హక్కులను సురేష్‌కు అప్పగించిన అంశంతోపాటు ఒప్పందం చేసుకున్న స్టాంప్ పేపర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) అమన్ వైష్ణవ్ దీనిపై స్పందించారు. పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 40 కింద ఆ మహిళా సర్పంచ్ తొలగింపు కోసం నోటీస్ జారీ చేసినట్లు తెలిపారు. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి కూడా షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. వారి వివరణ తెలుసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.