భోపాల్: హత్యకు గురైన మహిళ ఏడాదిన్నర తర్వాత సజీవంగా ఇంటికి తిరిగి వచ్చింది. (woman returns alive) ఆమెను చూసి తండ్రి, కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అయితే ఆ మహిళ హత్య కేసులో అరెస్టైన నలుగురు వ్యక్తులు జైల్లో ఉన్నారు. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2023 సెప్టెంబర్లో గాంధీ సాగర్ ప్రాంతంలో నివసించే 35 ఏళ్ల లలితా బాయి అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ముఖం చిద్రమైన మహిళ మృతదేహాన్ని లలిత కుటుంబానికి పోలీసులు చూపించారు. చేతిపై పచ్చబొట్టు, కాలికి నల్లటి దారం వంటి భౌతిక గుర్తుల ఆధారంగా ఆమె తన కుమార్తె అని తండ్రి గుర్తించాడు. ఆ తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఆ మహిళ హత్య కేసుకు సంబంధించి నలగురు అనుమానితులైన ఇమ్రాన్, షారుక్, సోనూ, ఎజాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
మరోవైపు రెండు రోజుల కిందట లలితా బాయి తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె సజీవంగా ఉండటం చూసి తండ్రి, కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తల్లి తిరిగి రావడం పట్ల ఆమె ఇద్దరు పిల్లలు సంతోషం పట్టలేకపోయారు. అనంతరం లలితా బాయి తన తండ్రితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఏడాదిన్నర కిందట షారుక్ అనే వ్యక్తితో కలిసి భానుపరాకు తాను వెళ్లినట్లు పోలీసులకు చెప్పింది. అక్కడ రెండు రోజులు ఉన్నానని, ఆ తర్వాత రూ.5 లక్షలకు మరో వ్యక్తికి అతడు అమ్మినట్లు చెప్పింది.
కాగా, రాజస్థాన్లోని కోటాకు తనను తీసుకెళ్లగా ఏడాదిన్నర కాలంగా అక్కడ నివసించినట్లు లలిత వివరించింది. చివరకు తప్పించుకుని తన గ్రామానికి తిరిగి చేరుకున్నట్లు ఆమె వెల్లడించింది. తన గుర్తింపును నిర్ధారించేందుకు ఆధార్, ఓటర్ ఐడీ వంటి పత్రాలను లలితా బాయి స్థానిక పోలీసులకు చూపించింది. ఇది తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. దీని గురించి పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అలాగే హత్యకు గురైన మహిళ ఎవరు అన్నది దర్యాప్తు చేస్తున్నారు. జైల్లో ఉన్న నిందితుల విడుదల గురించి పరిశీలిస్తున్నారు.