దుమ్కా: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా, మధుబన్ గ్రామంలో సోమవారం దారుణం జరిగింది. రేషన్ సరుకులను పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తూ మహిళా రేషన్ డీలర్‌కు చెప్పుల దండ వేసి స్థానికులు ఊరేగించారు. గోవింద్పూర్-సాహెబ్‌గంజ్ రాష్ట్ర హైవేను దాదాపు అరగంట సేపు దిగ్బంధనం చేశారు. మంగళవారం రేషన్ పంపిణీ చేయిస్తామని హామీ ఇచ్చి, వారిని శాంతింపజేసినట్లు గోపోకందర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రంజిత్ మండల్ తెలిపారు. ఈ రేషన్ డీలర్ మేలో 60 శాతం, జూన్‌లో 7 శాతం రేషన్ సరుకులను మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తనిఖీల్లో వెల్లడైంది.
బెంగళూరు, జూన్ 25: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కర్ణాటక పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. వేధింపులు, బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి తాజాగా మరో కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రజ్వల్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ సహా మరో ముగ్గురుని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. నిందితులు ప్రజ్వల్ రేవణ్ణ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ సహా మరో ముగ్గురు బాధితురాలిపై లైంగిక వేధింపుల సమయంలో తీసిన ఫొటోలను వీడియో కాల్లో పంచుకున్నారని ‘సిట్’ అధికారులు తెలిపారు.
ముంబై: మహారాష్ట్రలోని పుణేలో మే 19న జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో మైనర్ నిందితుడిని తక్షణమే అబ్జర్వేషన్ హోం నుంచి విడుదల చేయాలని బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ 17 ఏళ్ల మైనర్ బాలుడు మద్యం మత్తులో కారును నడిపి, ఓ మోటారు బైక్‌ను ఢీకొట్టాడని పోలీసులు ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని అబ్జర్వేషన్ హోంలో రిమాండ్‌లో ఉంచాలని జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. అధికార పరిధి లేకుండా, చట్టవిరుద్ధంగా బోర్డు ఈ ఆదేశాలను జారీ చేసిందని తెలిపింది. మైనర్‌ను తన మేనత్త కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. నిందితుని వయసు 18 సంవత్సరాల కన్నా తక్కువ అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపింది. నిందితుని మేనత్త దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.
లక్నో: శ్రీరామ జన్మభూమిలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నది. టాటా సన్స్ ప్రతిపాదించిన ‘దేవాలయాల మ్యూజియం’ నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అయోధ్యలో రూ.650 కోట్లతో దేవాలయాల సంగ్రహాలయాన్ని నిర్మిస్తామని టాటా సన్స్ ప్రతిపాదించిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల నమూనాలను దీనిలో నిర్మిస్తారని చెప్పారు. దీనికోసం భూమిని 90 సంవత్సరాలపాటు నామమాత్రపు రుసుము రూ.1కి లీజుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభ పరిష్కారం కోసం రాష్ట్ర మంత్రి ఆతిశీ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష భగ్నమైంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు లోక్ నాయక్ హాస్పిటల్ తరలించారు. ఎమర్జెన్సీ ఐసీయూలో చేర్పించారు.