న్యూఢిల్లీ: ఒక మహిళ డాక్టర్‌గా ఫోజులిచ్చింది. ఎయిమ్స్ డాక్టర్ల హాస్టల్లో చోరీలు చేస్తున్నది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వందకుపైగా సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు. (Jewel Thief At AIIMS) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మార్చి 27న ఎయిమ్స్‌లోని మహిళా వైద్యురాలి రూమ్‌లో దొంగతనం జరిగింది. రెండు బంగారు గొలుసులు, బంగారు ఉంగరం, జత బంగారు చెవిపోగులు, బంగారు గాజు, రూ. 4,500 నగదు, పది వేల విలువైన మలేషియా కరెన్సీ చోరీ జరిగినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.
కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎయిమ్స్ హాస్టల్ ప్రాంగణంలోని సుమారు వందకుపైగా సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించారు. లేడీ డాక్టర్లు విధులకు వెళ్లిన తర్వాత డాక్టర్ కోటు ధరించిన మహిళ పలు గదులు తెరిచేందుకు ప్రయత్నించినట్లు గమనించారు. ఆమె స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఘజియాబాద్‌లోని అడ్రస్ తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి ఆ మహిళను అరెస్ట్ చేశారు.
మరోవైపు నిందితురాలైన 43 ఏళ్ల మహిళ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఆభరణాలు ధరించడం ఇష్టమున్న ఆమె వాటిని కొనే స్థోమత లేక చోరీలకు పాల్పడుతున్నదని చెప్పారు. ఎయిమ్స్ మహిళా వైద్యులు విధులకు వెళ్లినప్పుడు వారి గదులకు తాళం వేయకపోవడాన్ని ఆమె గమనించిందని అన్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం రాకుండా డాక్టర్ కోటు ధరించి అక్కడకు వెళ్లి చోరీలు చేస్తున్నదని వెల్లడించారు.