లక్నో: ఒక మహిళ టీలో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి అతడి గొంతునొక్కి హత్య చేసింది. (Wife Kills Husband With Lover’s Help) మృతదేహాన్ని సీలింగ్‌కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం తెలియడంతో మహిళ, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫతేగంజ్‌లో నివసిస్తున్న కేహర్ సింగ్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 25 ఏళ్ల రేఖతో 16 ఏళ్ల కిందట అతడికి వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలున్నారు.
కాగా, రేఖకు పింటూ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కేహర్ సింగ్‌కు ఇది తెలియడంతో ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేసేందుకు రేఖ ప్లాన్ వేసింది. ఏప్రిల్ 13న ఆదివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడు పింటూను తన ఇంటికి పిలిచింది. వారిద్దరూ కలిసి గొంతు నొక్కి కేహర్ సింగ్‌ను హత్య చేశారు. అనంతరం అతడి మెడకు తాడు బిగించి సీలింగ్‌కు వేలాడదీశారు.
మరోవైపు సోమవారం తెల్లవారుజామున తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రేఖ పెద్దగా ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టింది. ఇరుగుపొరుగు వారు ఇది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. కేహర్ సింగ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, గొంతు నొక్కి అతడ్ని చంపినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. దీంతో భార్య రేఖను అదుపులోకి ప్రశ్నించారు. ప్రియుడు పింటూతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.