గురుగ్రామ్: పెండ్లయిన వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ.. తన భార్యతో మాట్లాడుతున్నాడని భాగస్వామిని (Live-in Partner) హత్యచేసింది. గురుగ్రామ్‌లోని బలియవాస్కు చెందిన హరీశ్ శర్మ (40 ఏండ్లు) ఓల్డ్ స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని అశోక్ నగర్‌కు చెందిన యాష్మిత్ కౌర్ (27)తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు గత ఏడాది కాలంగా డీఎల్ఎఫ్ ఫేజ్ 3లోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నారు. అయితే శర్మ భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. శనివారం రాత్రి కూడా శర్మ తన భార్యతో మాట్లాడటాన్ని గమనించిన కౌర్.. అతనితో గొడవకు దిగింది.
అదికాస్తా ముదరడంతో ఆగ్రహావేశాలకు లోనైన కౌర్.. వంటగదిలో ఉపయోగించే కత్తితో శర్మ ఛాతీలో పొడిచింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితురాలు కౌర్‌ను అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, బాధితుని స్నేహితుడు విజయ్ అలియాస్ అదే అపార్టుమెంటులో మరో రూమ్‌లో ఉంటున్నాడు. కౌర్, అతడు కలిసి పథకం ప్రకారమే శర్మను చంపేశారని బాధితుడి మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.