బెంగళూరు: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఒక మహిళను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళను హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని ఒక బావిలో పడేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. (Woman Raped, Murdered) కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హోక్రాని గ్రామానికి చెందిన 21 ఏళ్ల అశ్విని బీఏ పూర్తి చేసింది. నెల రోజుల కిందట ఆమెకు ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది.
కాగా, ఆగస్ట్ 19న అశ్విని తన తల్లిదండ్రులతో కలిసి పొలంలో పనులకు వెళ్లింది. సాయంత్రం 6 గంటల సమయంలో వారితో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత కడుపు నొప్పితో ఆమె బాధపడింది. ఈ నేపథ్యంలో రాత్రి 7 గంటల సమయంలో బహిర్భూమి కోసం ఇంటి సమీపంలోని ఖాళీ స్థలానికి వెళ్లింది.
అయితే తమ కుమార్తె ఎంతకీ తిరిగి రాకపోవడంతో అశ్విని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ రాత్రి వేళ ఆమె కోసం వెతికారు. ఒక చోట ఆమె చెప్పులు, నీళ్ల పాత్ర కనిపించాయి. మరునాడు ఉదయం ఒక పొలం సమీపంలోని బావిలో యువతి మృతదేహం ఉన్నట్లు ఆ కుటుంబానికి సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు వెళ్లి పరిశీలించారు. దుస్తులు లేకుండా బావిలో పడి ఉన్న మృతదేహం అశ్వినిదేనని గుర్తించారు.
మరోవైపు కుమార్తె ముఖంపై గాయాలు, ఇతర గాట్లు ఉండటాన్ని ఆమె తల్లిదండ్రులు గమనించారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు అదే గ్రామానికి చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులలో ఒకరు నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరిచి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.