లక్నో: ఆలయాన్ని దర్శించిన మహిళా న్యాయమూర్తి మెడలోని మంగళసూత్రాన్ని ఆడ దొంగలు తెంపుకెళ్లారు. (Judge’s Mangalsutra Snatched) ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. పది మంది మహిళా దొంగలను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ప్రేమా సాహు, జూన్ 1న కుటుంబ సభ్యులతో కలిసి బృందావనంలోని ఠాకూర్ రాధారామన్ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా భక్తుల మాదిరిగా నటించిన ఆడ దొంగలు ఆ మహిళ న్యాయమూర్తి మెడలోని బంగారు మంగళసూత్రాన్ని దొంగిలించారు.
కాగా, జడ్జి ప్రేమా సాహు ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. బృందావనంలో భక్తుల రద్దీ నేపథ్యంలో చోరీలు, పిక్‌పాకెటింగ్‌కు పాల్పడే దొంగలను గుర్తించేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం పది మంది మహిళా దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పురుషులు, మహిళలకు చెందిన చోరీ చేసిన పలు పర్సులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
మరోవైపు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డెబిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇతర ముఖ్యమైన పత్రాలతో సహా రూ.18,652 నగదు ఆ పర్సుల్లో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన మహిళలు ఇక్కడకు వచ్చి దొంగల ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. అరెస్టు చేసిన ఆడ దొంగలను జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
Also Read: