భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తలకు గాయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన మహిళకు కండోమ్ ప్యాక్‌తో కట్టుకట్టారు. అనంతరం ఆమెను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ మహిళ తల గాయం కట్టు విప్పిన డాక్టర్లు, కండోమ్ ప్యాక్‌తో కట్టువేయడం చూసి షాకయ్యారు. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోర్సా ప్రాంతానికి చెందిన రేష్మా బాయి అనే మహిళ తలకు గాయమైంది. దీంతో రక్తం కారుతుండటంతో ఆమెను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు దూదితోపాటు కండోమ్ ప్యాక్‌తో తలకు కట్టుకట్టారు. అనంతరం ఆమెను జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
కాగా, కుటుంబ సభ్యులు రేష్మా బాయిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు తల గాయం పరిశీలించేందుకు పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వేసిన కట్టును విప్పారు. అయితే దూదితోపాటు కండోమ్ ప్యాక్ రేపర్‌తో కట్టుకట్టడం చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. తలకు తీవ్ర గాయమైన ఆ మహిళకు చికిత్సలో నిర్లక్ష్యం వహించి బ్యాండేజీకి బదులుగా కండోమ్ ప్యాక్ రేపర్‌తో కట్టుకట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్యాండేజీ కొరత వల్ల ఇలా చేసి ఉంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.