ఫరీదాబాద్, డిసెంబర్ 31: బీజేపీ పాలిత హర్యానాలోని ఫరీదాబాద్‌లో లిఫ్టు అడిగిన మహిళపై ఇద్దరు వ్యక్తులు కదులుతున్న వ్యానులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఫరీదాబాద్ నివాసులైన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం భర్తతో విడిపోయి, తల్లితో కలసి ఉంటున్న ఓ మహిళ డిసెంబర్ 29వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తల్లితో గొడవపడి తన స్నేహితురాలిని కలుసుకోవడానికి బయల్దేరింది. తన సోదరికి ఫోన్ చేసి తన స్నేహితురాలిని కలుసుకునేందుకు వెళుతున్నానని, మూడు గంటల్లో ఇంటికి తిరిగి వచ్చేస్తానని బాధితురాలు తెలిపింది.
రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వెళ్లేందుకు మెట్రో చౌక్ వద్దకు చేరుకున్న ఆమె ఆటో కోసం ప్రయత్నించింది. ఇంతలో ఎకో వ్యానులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఇంటి దగ్గర దిగబెడతామని హామీ ఇచ్చారు. నమ్మి వాహనం ఎక్కిన ఆమెను ఆమె ఇంటి వైపు కాకుండా ఫరీదాబాద్-గురుగ్రామ్ రోడ్డు వైపు కారును మళ్లించారు. ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కదులుతున్న వ్యానులోనే ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు రెండు గంటలపాటు కారులోనే ఆమెను తిప్పుతూ అత్యాచారానికి పాల్పడిన నిందితులు తర్వాత ఆమెను రోడ్డుపై తోసేసి వ్యానుతో పరారయ్యారు.
డిసెంబర్ 30 తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో రోడ్డుపై తలకు తీవ్రమైన గాయంతో పడి ఉన్న ఆమె తన సోదరికి ఫోన్ చేసి సమాచారం అందచేసింది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఆమె తన సోదరిని ఫరీదాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించింది. ఆమె పరిస్థితిని చూసిన డాక్టర్లు బాధితురాలిని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని సూచించారు. అయితే ప్రస్తుతం బాధితురాలు ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.