లక్నో: ఒక మహిళ, ఆమె స్నేహితులకు పిల్లి ఎదురువచ్చింది. వారు వెళ్తున్న రోడ్డును క్రాస్ చేసిన ఆ పిల్లిని పట్టుకున్నారు. సజీవదహనం చేసి దానిని చంపారు. (cat burnt alive) దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ లీక్ కావడంతో ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఆ మహిళ, ఆమె స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భోజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌పై వెళ్లింది. దారిలో వారికి ఒక పిల్లి ఎదురువచ్చింది. పిల్లి రోడ్డు దాటడాన్ని అపశకునంగా వారు భావించారు. ఆ పిల్లిని పట్టుకున్నారు. దానికి నిప్పుపెట్టి సజీవదహనం చేశారు. ఈ క్రూర చర్యను వీడియో రికార్డ్ చేశారు.
కాగా, ఢిల్లీలోని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకు ఈ విషయం తెలిసింది. వీడియో క్లిప్‌తో సహా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు అందింది. దీంతో భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వారు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బైక్ నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. భోజ్‌పూర్‌కు చెందిన ప్రియా, ఆమె స్నేహితులను నిందితులుగా గుర్తించారు. వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. దోషులుగా తేలితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష జరిమానా విధించే అవకాశం ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు.