ముంబై: ఒక మహిళను అడవిలోని చెట్టుకు గొలుసులతో కట్టేశారు. (Woman Chained In forest) గొర్రెలు కాసుకునే వ్యక్తి ఆమె ఆర్తనాదాలు విన్నాడు. ఆ మహిళ వద్దకు చేరుకున్నాడు. ఆమె దీనస్థితి చూసి షాకయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం సోనూర్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అటవీ ప్రాంతంలో మహిళ కేకలు విన్నాడు. ఆమె వద్దకు చేరుకున్న అతడు, గొలుసులతో చెట్టుకు కట్టేసి ఉన్న మహిళను చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, పోలీసులు ఆ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసిన 50 ఏళ్ల మహిళను కాపాడారు. అమెరికా పాస్పోర్ట్ ఫొటో కాపీ, తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డు, ఇతర పత్రాలు ఆమె వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆ మహిళను తొలుత రెండు ఆసుపత్రులకు తరలించారు. ఆమె మానసిక, ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు డాక్టర్లు చెప్పారు.
మరోవైపు ఆ మహిళను లలితా కయీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నదని చెప్పారు. ఆ మహిళ పదేళ్లుగా భారత్లో ఉంటున్నదని, ఆమె వీసా గడువు ముగిసినట్లు గుర్తించామన్నారు. ఆ మహిళ జాతీయతను నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, తమిళనాడుకు చెందిన భర్త ఆమెను అడవిలోని చెట్టుకు గొలుసులతో కట్టేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ఆమె ఎన్ని రోజులు ఆ అడవిలో అలాంటి దీనస్థితిలో ఉన్నదో తెలియదన్నారు. తమిళనాడు, గోవాలోని ఆ మహిళ బంధువులను గుర్తించి ఆమె సమాచారం సేకరించేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.